నిశ్చల చలనం ....! ఆచార్య డా. ఎన్. గోపి ..........!
నిశ్చల చలనం
కొండను చూసినప్పుడల్లా
నాకు నదిని చూసినంత ఊపొస్తుంది.
నది కదులుతుంది
కొండ కదిలిపొమ్మంటుంది.
దూరాలను రచిస్తూ సాగిపోయే సజీవకావ్యం నది.
కాలాన్ని పీలుస్తూ వేకువల్ని ధరించే
నిశ్చలస్ఫూర్తి కొండ.
వందలాది పల్లెలకు ఆ రాయొక పెద్ద దిక్కు.
వర్షం కురిసినప్పుడు
గుంటల్ని నింపుకొని అది సరస్సవుతుంది
రాలిన ముత్యాలను బుగ్గలమీద వొలకబోసుకుంటుంది
రాతిగ్రంథానికీ వివిధ ప్రకరణాలుంటాయి.
ఈ ప్రాంతమంతా తన దుఃఖవస్త్రాన్ని
ఈ రాతిమీదే ఆరేసుకుంటుంది.
కొండచుట్టూ పాములా మెలికలు తిరిగే రోడ్డు నడగండి
కొండ ఎంత దయాళువో!
వాహనాల చైతన్యంతో రోడ్డు మురిసిపోతున్నప్పుడు
కొండ కొండంత హృదయంతో ఆశీర్వదిస్తుంది.
మా జాజు చారల గోడల ఇంటిలో
నేను తలదువ్వుకునే అద్దం పెంకులో
కొండ కొంచెమై వొదిగిపోతుంది.
సంధ్య నారక్తం పీల్చి ఎరుపెక్కుతున్నప్పుడు
కొండదాన్ని తన రంగులోకి మార్చి ఓదారుస్తుంది.
సాయంత్రం ఆఖరి పక్షులు
తనమెడలో మాలవేసినప్పుడు
చెట్టంత మనసుతో పొంగిపోతుంది.
కోట్లాది సంవత్సరాల
కాల ప్రవాహంలో నలిగిన
సాలగ్రామం ఈ కొండ.
పేదరికాన్ని కిరీటంగా ధరించినప్పుడు
నా ఆశల పట్టాభిషేకం
ఈ కొండకిందే జరిగింది.
మా కొండమీద చెక్కిన అక్షరాలు
చిన్నప్పుడు నేను వేయించిన శాసనాలు.
మిత్రులందరం ఆకుల్లా చెదిరిపోయాం
చిత్రంగా మా అందరి రక్తాల్లో రాయి ప్రవహిస్తున్నది.
విత్తనం నేలను ముద్దాడితే పుట్టేది మొలక
మరి ఈ కొండను జీవితాల్లో నాటిన ప్రకృతి
వేలవేల స్వప్నాలను పూయించింది.
క్షణాలు జలరూపంలో పరిగెత్తితే నది
ఆదిమ వేదనతో పేలకుండా వుండి
నిబ్బరంగా వున్న సహన సంస్కృతి కొండ.
కొండకు చెవి ఆనించి
నేను అనంత సంగీతాన్ని వింటాను.
అందరినీ కలుపుకుపోయే
ఆహ్లాద ప్రయాణం నది అయితే
ఒంటరితనాన్ని ఛేదించి
అందరినీ పిలుచుకునే ఆప్యాయపుముద్ద కొండ.
కొండ నా ఆర్తి.
కొండ నా ఆస్తి.
కొండ నా చిరునామా!
- ఆచార్య ఎన్. గీపి ....!
(చుట్టకుదురు కవితాసంకలనం నుంచి)
కొండను చూసినప్పుడల్లా
నాకు నదిని చూసినంత ఊపొస్తుంది.
నది కదులుతుంది
కొండ కదిలిపొమ్మంటుంది.
దూరాలను రచిస్తూ సాగిపోయే సజీవకావ్యం నది.
కాలాన్ని పీలుస్తూ వేకువల్ని ధరించే
నిశ్చలస్ఫూర్తి కొండ.
వందలాది పల్లెలకు ఆ రాయొక పెద్ద దిక్కు.
వర్షం కురిసినప్పుడు
గుంటల్ని నింపుకొని అది సరస్సవుతుంది
రాలిన ముత్యాలను బుగ్గలమీద వొలకబోసుకుంటుంది
రాతిగ్రంథానికీ వివిధ ప్రకరణాలుంటాయి.
ఈ ప్రాంతమంతా తన దుఃఖవస్త్రాన్ని
ఈ రాతిమీదే ఆరేసుకుంటుంది.
కొండచుట్టూ పాములా మెలికలు తిరిగే రోడ్డు నడగండి
కొండ ఎంత దయాళువో!
వాహనాల చైతన్యంతో రోడ్డు మురిసిపోతున్నప్పుడు
కొండ కొండంత హృదయంతో ఆశీర్వదిస్తుంది.
మా జాజు చారల గోడల ఇంటిలో
నేను తలదువ్వుకునే అద్దం పెంకులో
కొండ కొంచెమై వొదిగిపోతుంది.
సంధ్య నారక్తం పీల్చి ఎరుపెక్కుతున్నప్పుడు
కొండదాన్ని తన రంగులోకి మార్చి ఓదారుస్తుంది.
సాయంత్రం ఆఖరి పక్షులు
తనమెడలో మాలవేసినప్పుడు
చెట్టంత మనసుతో పొంగిపోతుంది.
కోట్లాది సంవత్సరాల
కాల ప్రవాహంలో నలిగిన
సాలగ్రామం ఈ కొండ.
పేదరికాన్ని కిరీటంగా ధరించినప్పుడు
నా ఆశల పట్టాభిషేకం
ఈ కొండకిందే జరిగింది.
మా కొండమీద చెక్కిన అక్షరాలు
చిన్నప్పుడు నేను వేయించిన శాసనాలు.
మిత్రులందరం ఆకుల్లా చెదిరిపోయాం
చిత్రంగా మా అందరి రక్తాల్లో రాయి ప్రవహిస్తున్నది.
విత్తనం నేలను ముద్దాడితే పుట్టేది మొలక
మరి ఈ కొండను జీవితాల్లో నాటిన ప్రకృతి
వేలవేల స్వప్నాలను పూయించింది.
క్షణాలు జలరూపంలో పరిగెత్తితే నది
ఆదిమ వేదనతో పేలకుండా వుండి
నిబ్బరంగా వున్న సహన సంస్కృతి కొండ.
కొండకు చెవి ఆనించి
నేను అనంత సంగీతాన్ని వింటాను.
అందరినీ కలుపుకుపోయే
ఆహ్లాద ప్రయాణం నది అయితే
ఒంటరితనాన్ని ఛేదించి
అందరినీ పిలుచుకునే ఆప్యాయపుముద్ద కొండ.
కొండ నా ఆర్తి.
కొండ నా ఆస్తి.
కొండ నా చిరునామా!
- ఆచార్య ఎన్. గీపి ....!
(చుట్టకుదురు కవితాసంకలనం నుంచి)